2, జనవరి 2010, శనివారం

1.శ్రీ రామచంద్రుని సేవించినను చాలు .









1. శ్రీ రామచంద్రుని సేవించినను చాలు

ప.. శ్రీరామచంద్రుని సేవించినను చాలు
      శాశ్వతానందమును శాంతియును కలుగు
1.  భరతుడే సేవించె పాదుకలనే కొలిచి
     లక్ష్మణుడు సేవించె నిద్ర హారము మాని
    గుహుడు సేవించెను పాదములు స్పృసియించి
    శబరి సేవించెను మధుర ఫలముల నొసగి
2. మారుతి సేవించె మనసు రంజిల్లగా
    వాల్మీకి సేవించె రామ రామ యనుచు
    గోపన్న సేవించి గోపురములే కట్టె
    త్యాగయ్య సేవించి మధుర గానముచేసె
3.  శ్రీ రామ సేవకులుయెందరెందరో గలరు 
     సేవ లెన్నయొ చేసి తరియించినారు
    శ్రీ రామ సేవనము సంతోష భరితము
    ముచ్చట గొలుపునది ముక్తి దాయకమిది
     రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం   02012010 smkodav@gmail.com

1, జనవరి 2010, శుక్రవారం

2. రామ రామ యనవె ఓ రామ చిలుక

2. రామ రామ యనవె ఓ రామ చిలుక
   రామ రామ యనవె ఓ రామ చిలుక
        నీ నోట వే వేల వరహాలు వొలక


1.  వరహాల మూటలను వరుసగా గొనిపోయి             
     భద్రాద్రి నంతటను బంగారు చేదాము 
     నీ సంతతి చేత నిత్యము పలికించు 
     సత్య వ్రతుండైన శ్రీ రామ నామాలు


2.  రవ్వల పేరుల మువ్వల కడియాల  
     పచ్చలు కెంపులు పొదిగిన హారముల  
     వన్నెలే దిద్దుదము వైభవముగా మనము  
     వాడ వాడల నున్న రామ మందిరమ్ములకు


3.  శ్రీ రామ మందిరము లేదని ఎవరనిన  
     శీఘ్రమే మందిరము నిర్మించి వేతాము  
     సీతా సమేతుడై శ్రీ రాముడే వెలయ
        ఆంజనేయుడు వారి నమిత భక్తితొ కొలువ 
              రచన : కొడవంటి సుబ్రహ్మణ్యం
                      smkodav@gmail.com
పాట  వినండి ఈ క్రింది సైటులో: 

నా గురించి