26, డిసెంబర్ 2009, శనివారం

7. సీతా మాతను జూచితి రామా




 7. సీతా మాతను జూచితి రామా
పల్లవి..... సీతా మాతను జూచితి రామా
               శ్రీ రఘు రామా శ్రీ రామా
      1.     లంక యంతయును వెదకితి రామా - అశోక వనమున గాంచితి రామా 
              శోకము నందెను జానకి రామా - రావణు బారిన పడినది రామా
              నీవే దిక్కని నమ్మెను రామా - నిత్యము నిన్నే కొలచును  రామా 
              నీ ముద్రికనే యిచ్చితి రామా - చూడామణి నే తెచ్చితి రామా 
    2.      రాక్షస బలమును గాంచితి రామా - రాక్షసులను బరిమార్చితి రామా 
             రావణ సుతుడే వచ్చెను రామా - అక్షకునే హతమార్చితి రామా
             బ్రహ్మాస్త్రమునకు లొంగితి రామా - రావణు కొలువు జొచ్చితి రామా 
             రావణు గర్వము జూచితి రామా  - రాముడె శరణనమంటిని రామా 
    3.      విషయమంత వినిపించితి రామా - విరోధమ్ము వలదంటిని రామా 
             సీతను నీ చెంతకు రామా - శీఘ్రమే చేర్చమనంటిని రామా 
             విషపు నవ్వునే నవ్వెను రామా - విరోధినని దూషించెను రామా 
   4.      నన్ను చంపగా నెంచిరి రామా - విభీషణుండె వలదనె రామా 
             వాలమునకు వల పన్నిరి రామా - చీరల నెన్నియొ చుట్టిరి రామా 
             వారు రగిల్చిన అగ్నితొ రామా - లంకా దహనము చేసితి రామా 
             సీత క్షేమము చూసితి రామా - శీఘ్రమే నీ దరి చేరితి రామా  
   రచన : కొడవంటి సుబ్రహ్మణ్యం 

8. రామాయణమునకే రమ్యమగు కాండ



 8. రామాయణమునకే రమ్యమగు కాండ
 పల్లవి....రామాయణమునకే రమ్యమగు కాండ
            సుందరమ్మగు కాండ సుందరా కాండ
   1.    సీతా మహా సాధ్వి శాంతినొందిన కాండ
          రామ దేవుని మది రంజిల్లిన కాండ
          వీరాంజనేయుని విజ్రుమ్భణపు కాండ
          వానర శ్రేష్ఠునకు  వరమైన కాండ
    2.   రావణుని లంకలో రగడ జరిగిన కాండ
          రాక్షసుల గర్వము భంగ పరచిన కాండ
          రక్కసి మూకలను రచ్చకీడ్చిన కాండ
          దశకంఠునకు దడ పుట్టిన కాండ
   3.    అక్షయ కుమారుని హతమార్చిన కాండ
          అంజని సుతునకు అత్యద్భుతపు  కాండ
          మారుతికి తన బలము తెలిసిన కాండ
          లంకా దహనమ్ము జరిగిన కాండ
   4.    వాలముతోడ లంకాదహనము - వరమని తలచెను వాయు తనయుడు
          అగ్ని దేవుడే అనుగ్రహించెను - ఆశీర్వాదము పొందెను హనుమ
          ఆహుతి చేయుట కుపక్రమించెను - లంకా రాజ్యమే ఆహుతి ఆయెను
          సంపద అంతయు సమూలమ్ముగా - దగ్ధమా
యెను ధనగారములు
          అగ్ని జ్వాలలే ఆకసమంటెను - అగ్ని దేవునకు ఆకలి తీరెను
          అశోక వనమును హనుమ దర్శించే - హరిత వనమ్మై హాయిని గొలిపె
   5.    రామునకు హనుమన్న ఆప్తుడైన కాండ
          మైత్రీ బంధమున మహిమాన్వితపు కాండ  
          మరుతాత్మజునకు మరపు రాని కాండ
          ఆలింగనముతోడ హాయి గొలిపిన కాండ

                      రచన: కొడవంటి సుబ్రహ్మణ్యం 


                  
      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నా గురించి